Benefits by using On-Screen Keyboard




పీసీ యూజర్లు సాధారణంగా తమ పీసీలో వాడే చాలా సాఫ్టువేర్లు ఒరిజినల్స్ కాకపోవడంతో వారికి తెలియకుండానే వారి పీసీలో ఎదో ఒక సాఫ్టువేర్ చాటున కీలాగర్ పని చేస్తూ ఉంటుంది. కీలాగర్ అంటే ఏమిటి? ఫేస్_బుక్ కానివ్వండి, జీమెయిల్ కానివ్వండి, మరేదైనా కానివ్వండి, అకౌంట్_లోకి లాగిన్ కావడానికి యూజర్ ఐడీ మరియు పాస్_వర్డ్ టైపు చేసేటప్పుడు పీసీలో మాటువేసి ఉన్న కీలాగర్ మనం టైప్ చేసిన యూజర్ ఐడీ & పాస్_వర్డ్_లను పసిగట్టి వాటిన హ్యాకర్_కు చేరవేస్తుంది. ఈ ప్రాసెస్ అంతా మనకు ఏమాత్రం అనుమానం రాకుండా రహస్యంగా జరిగిపోతుంది.

ఈ విధంగా కీలాగర్ మూలంగా యూజర్ యొక్క వ్యక్తిగత సమాచారం తస్కరించబడుతుంది. కీలాగర్_కు చిక్కకుండా మన యూజర్ ఐడీలు, పాస్_వర్డ్_లు సురక్షితంగా ఉండాలంటే వాటిని టైప్ చేసేటప్పుడు మామూలు కీబోర్డు వాడకుండా “ఆన్-స్క్రీన్ కీబోర్డ్” ఉపయోగించాలి.

ఆన్-స్క్రీన్ కీబోర్డ్ అంటే ఏమిటి? మామూలు ఫిజికల్ కీబోర్డుకు ప్రత్యామ్నాయంగా మానిటర్ తెరపై అందించబడే వర్చువల్ కీబోర్డునే ఆన్-స్క్రీన్ కీబోర్డ్ అంటారు. అకౌంట్లు లాగిన్ అవడానికి ఐడీలు, పాస్_వర్డ్_లు టైప్ చేసేటప్పుడు, ఆన్_లైన్ బ్యాకింగ్ ట్రాన్సెక్షన్లు చేసే సమయంలో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్ నంబర్లు వంటి వ్యక్తిగత సమాచారాన్ని టైప్ చేసేటప్పుడు ఆన్-స్క్రీన్ కీబోర్డ్ ఉపయోగించాలి. ఆన్-స్కీన్ కీబోర్డును మౌస్ పాయింటర్ సహాయంతో అక్షరాలపై క్లిక్ చేస్తూ టైప్ చేయాలి కావున కీలాగర్_కు మన వ్యక్తిగత సమాచారం చిక్కే ప్రమాదమే ఉండదు.

ప్రతి ఆపరేటింగ్ సిస్టమ్_లో ఆన్-స్క్రీన్ కీబోర్డ్ తప్పకుండా ఉంటుంది. విండోస్7_లో Start> All Programs> Accessories> Ease Of Access> On-Screen Keyboard ద్వారా పొందవచ్చు.